అవినాష్ అరెస్టు‌లో సీబీఐ జాప్యం వెనుక “జగన్నాటకం” అదేనా..?

అవినాష్ అరెస్టు‌లో సీబీఐ జాప్యం వెనుక “జగన్నాటకం” అదేనా..?

వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం “డైలీ టీవీ” సీరియల్‌ను తలపిస్తోంది. ఆయనను అరెస్టు చేయకుండా.. సీబీఐ చేస్తున్న తాత్సారం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన హత్య కేసులో సీబీఐ అనుసరిస్తున్న వైఖరి.. విమర్శల పాలౌతోంది. అవినాష్ రెడ్డి‌ ఏదో ఒక కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు సీబీఐ అరెస్టు చేయదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఎలా “సాగు”తోందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ అవినాష్ రెడ్డి అరెస్టులో సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోంది..? మర్డర్ కేసులో నిందితుడైన అవినాష్ పట్ల అంత ఔధార్యం ఎలా చూపిస్తోంది…? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా సాగటం లేదంటూ.. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను సుప్రీం కోర్టు మార్చిన విషయం అందరికీ తెలసిందే. అయితే.. ఆ తరువాత అయినా కేసు దర్యాప్తు ముందుకు సాగిందా..? అంటే.. కాదనే సమాధానాలే వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరును చూస్తే.. విచారణ ప్రక్రియ నత్తతో పోటీ పడుతున్న చందంగా తయారైంది.

ఈ కేసులో నిందితులు కోరుకున్నట్టుగానే విచారణ ప్రక్రియ… సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. వివేకా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ అనుసరించిన ద్వంద్వ వైఖరి తీవ్ర విమర్శల పాలవుతోంది. భాస్కర్ రెడ్డిని ఆఘమేఘాల మీద అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు.

అతను ఆ కోర్టు.. ఈ కోర్టు అంటూ పిటీషన్ల మీద పిటీషన్లు వేసుకోవటానికి సీబీఐ అధికారులే సహకరిస్తున్నట్టుగా పరిస్థితి తయారైంది. ఓ సారి విచారణ నోటీసు ఇవ్వటం.. ఆ తరువాత ఆ విచారణకు తాను రాలేనంటూ అవినాష్ సమాధానం చెప్పటం.. సీబీఐ గడువు మీద గడువులు ఇవ్వటం.. పరిపాటిగా మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అరెస్టు వెనుక ఏదో గూడుపుఠాణి నడుస్తుందన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ రెడ్డి ఏదో ఒక కోర్టులో బెయిల్ తెచ్చుకునేంత వరకు అరెస్టు చేసే ఉద్దేశం సీబీఐకు లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ఆయన అరెస్టు ఖాయమని అంతా భావించారు. కానీ..తాను విచారణకు రాలేనంటూ అవినాష్ సమాధానం ఇవ్వటం.. దానికి సీబీఐ తలూపటం అందర్నీ నివ్వెర పరచింది. దర్యాప్తు సంస్థ అనుకున్న విధంగా కాకుండా… నిందితుడు కోరుకున్న విధంగా విచారణ సాగుతోందనే అనుమానాలకు సీబీఐ వైఖరి బలం చేకూరుస్తోంది. వాస్తవానికి అవినాష్ పై సీబీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ.. మే 19 వరకు ఛాన్స్ ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈలోగా అవినాష్ సుప్రీం కోర్టును ఆశ్రయించటం.. తన బెయిల్ పిటీషన్‌పై వెకేషన్ బెంచ్ వెంటనే విచారణకు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరటం.. అంతా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమనే అనుమానాలను కలిగిస్తోంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేస్తున్న సీబీఐ.. అతన్ని అరెస్టు చేయటంలో తాత్సారం ఎందుకు చేస్తోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదంతా.. ఢిల్లీ స్థాయిలో అదృశ్య శక్తి ఆడిస్తున్న నాటకంగా జనం భావించాల్సి వస్తోంది.

అవినాష్ రెడ్డికి ఏదో ఒక కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు లేదా.. సుప్రీం కోర్టు విచారణ గడువు ముగిసేంత వరకు ఈ డ్రామా కంటిన్యూ అవుతందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టబద్దమైన దర్యాప్తు సంస్థలే ఇలా.. నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తే.. ఎలా..? అని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా..? లేక ఆయనకు బెయిల్ వచ్చేంత వరకు విచారణను సాగతీస్తుందా..? అనేది వేచి చూడాలి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *