
సజ్జలకు జగన్ బంపరాఫర్.. అందేంటో తెలుసా?
- Ap political StoryNewsPolitics
- June 15, 2023
- No Comment
- 20
జగన్ సర్కార్ సలహాదారులను పెంచిపోషిస్తోంది. వారిచ్చే సలహాలేంటో, అవి ప్రభుత్వానికి ఉపయోగపడేదెంతో గానీ…. లక్షల జీతాలు ఇస్తూ, రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. సజ్జల సహా నలుగురి పదవీకాలాన్ని మళ్లీ పొడిగించినట్లు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్ పదవికాలాన్ని మరికొంతకాలం ఎక్స్ టెండ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు.. ఇలాంటి పదవుల్లో ఉన్నవారికి గడువు పూర్తైన తర్వాత తొలగిస్తుంటాయి. వీరి స్థానంలో వేరే వారిని నియమిస్తుంటాయి. కానీ మార్పులు చేయడానికి జగన్ మనసు అంగీకరించినట్లుగా కనిపించడం లేదు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయ నిరుద్యోగులందరికీ ఇష్టారాజ్యంగా సలహాదారుల పదవులు ఇచ్చుకుంటూ పోయారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు, శాఖలకు సలహాదారుల్ని నియమించేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండగా..ఆయనకు మరికొందరు సలహాదారులున్నారు. సలహాదారులుగా నియమించినప్పుడు వీరి పదవీకాలం మూడేళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత రెండేళ్లకు కుదించింది. ఇప్పుడు మూడోసారి పదవీకాలం పెంపునకు సిద్ధమైంది.
సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టు గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీఎం జగన్, మంత్రులకు సలహాదారులను నియమిస్తే పర్వాలేదు కానీ ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే రేపు కలెక్టర్, కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారును నియమిస్తారేమో అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు క్యాడర్ ఉంటుందని, అలాగే జీతభత్యాలు బడ్డెట్ నుంచి ఇస్తారని, కానీ దానికి విరుద్ధంగా వీరి నియామకాలు, జీతభత్యాల చెల్లింపులు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజాధనం నుంచి వీరికి చెల్లింపులు చేయడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా సలహాదారుల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంది.
జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని, ఈ ఏడాది చివరలోనే ఏపీలో ఎన్నికలుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కీలక పదవుల్లో మార్పులు చేస్తే.. అది గందరగోళానికి దారీ తీయవచ్చనే ఉద్దేశంతోనే… జగన్ సలహాదారుల పదవీకాలాన్ని పొడిగించారనే ప్రచారం జరుగుతోంది.