
ఇడుపులపాయకు షర్మిల..షెడ్యూల్ మార్చుకున్న జగన్
- Ap political StoryNewsPolitics
- July 6, 2023
- No Comment
- 26
అన్నా చెల్లెల అనుబంధం..జన్మజన్మల సంబంధం. కానీ, ఆ అన్నాచెల్లెలిద్దరూ ఎడమొహం పెడమోహంగా ఉంటున్నారు. ఎంతలా అంటే, తండ్రికి నివాళి అర్పించేందుకు కూడా కలిసి వెళ్లలేనంత దూరమయ్యారు. వైఎస్ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు… షర్మిల తల్లి విజయమ్మతో కలిసి 7వ తేదీ రాత్రికి ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారని కడపలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తండ్రి వైఎస్సార్ జయంతి రోజున ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కనబెట్టేసి… ఉదయాన్నే వచ్చి కార్యక్రమంలో పాల్గొనేవారు జగన్. ప్రతిసారి 8 తేది ఉదయం 8 గంటలకు జగన్ వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించే వారు. అలాంటిది ఆయన ఎన్నడు లేని విధంగా తన షెడ్యూల్‌ను 8 తేది మధ్యాహ్నానికి మార్చుకున్నారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలను కలవకూడదనే జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారని జనం చర్చించుకుంటున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు కడప జిల్లాలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా కుటుంబసభ్యులంతా కలిసి ఇడుపుల పాయకు వెళ్లి నివాళులర్పించేవారు. కానీ, కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య విభేదాలతో ఇద్దరూ పలకరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంతకుముందు విజయమ్మ జగన్ దగ్గర ఉండేవారు. కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో షర్మిల వద్దకు వెళ్లిపోయారు. ఆస్తుల పంపకాల్లో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం నడుమ షర్మిల ఇడుపులపాయ పర్యటన ఆసక్తి పెంచుతోంది.