
రాజధాని రైతులపై పగబట్టిన జగన్ రెడ్డి
- Ap political StoryNewsPolitics
- March 23, 2023
- No Comment
- 42
అమరావతి రాజధాని లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసింది. 900 ఎకరాల్లో ఆర్ 5 జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.రాజధానికి భూములిచ్చిన రైతులు అభ్యంతరాలు చెబుతున్నా, గ్రామసభలు పెట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయ లేదు. ఓ వైపు ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు ఉండగానే ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలు కల్పించే విధంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాల ప్రజలకు, అంటే రాజధానికి సంబంధంలేని 50 వేల మందికి అమరావతి రాజధానిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. రాజధాని భూములను ఇతర అవసరాలకు వినియోగించడంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చేందుకు ముందుగా సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసింది. దాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో కేసు వేశారు. కేసు నడుస్తుండగానే ప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేస్తూ ఆర్ 5 జోన్ ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
రాజధాని పరిధిలో వివిధ ప్రాంతాల్లోని 900 ఎకరాలు సేకరించి ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అమరావతి రాజధానిని విచ్ఛన్నం చేసే కుట్రలో భాగంగానే రైతులిచ్చిన భూములను పేదల పేరుతో అస్తవ్యస్తం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ లో మార్పు చేసేందుకు సీఆర్డీఏ చట్టాన్ని 2022 అక్టోబరు 18న సవరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. ప్రత్యేక అధికారులతో తీర్మానాలు చేయించి మాస్టర్ ప్లాన్ లో సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా ప్రకటన విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాలతోపాటు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో 900 ఎకరాల్లో కొత్తగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణంలో రైతులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. కనీసం 25 సంవత్సరాల పాటు రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులకు, పేదలకు మధ్య గొడవ పెట్టాలని చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఒక్కొక్కరికి నాలుగు సెంట్ల చొప్పున భూమి ఇచ్చినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను, ఎక్కడో విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాల్లో ఉండే వారికి సెంటు చొప్పున ఇవ్వాలనే ప్రయత్నాల వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోంది. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్ష టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ ప్రచారం మొదలు పెడతారు. కోర్టులో వ్యతిరేక తీర్పు రాగానే టీడీపీ నేతలు అడ్డుకోవడం వల్లే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామని ముసలి కన్నీరుకారుస్తారు. పేదలపై ప్రేమ ఉంటే విజయవాడ రూరల్ గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి పేదలకు పంచవచ్చు. ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ అమరావతి రాజధాని భూములే పేదలకు ఇవ్వాలని చూడటం అనేది కేవలం రాజకీయ డ్రామాగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.