సీఎం జగన్ చెప్పిన ఆ 7 పచ్చి అబద్దాలు ఇవే…

సీఎం జగన్ చెప్పిన ఆ 7 పచ్చి అబద్దాలు ఇవే…

నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడటానికి అలవాటు పడ్డ ఏపీ సీఎం జగన్ రెడ్డి.. తనకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. వేదిక ఏదైనా తనకు అలవాటు అయిన అబద్దాలనే వల్లె వేస్తున్నారు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా చిలకలూరి పేట సభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన అబద్దాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “నవ్వి పోదురు గానీ నాకేటి సిగ్గు..” అన్న చందంగా సీఎం తీరు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిస్సిగ్గుగా సీఎం జగన్ రెడ్డి మాట్లాడిన ఆ అబద్దాల్లో ఆణిముత్యాలను ఇప్పుడు చూద్దాం..

అబద్దం1: నాకు మీడియా బలం లేదంటున్న జగన్..!

చిలకలూరి పేట వేదికగా సీఎం జగన్ రెడ్డి తనకు అండగా ఎలాంటి మీడియా బలం లేదని అబద్దం చెప్పారు. అయితే రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా జగన్ రెడ్డి చేతిలో ఉన్న మీడియా సంస్థల గురించి చెప్పేస్తాడు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరివి..? అంటే అన్ని వేళ్లూ జగన్ వైపే చూపిస్తాయి. సాక్షి సంస్థల యాజమాన్య సంస్థ అయిన ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు తొలి ఛైర్మన్ గా ఉన్న జగన్ రెడ్డి.. తనకు మీడియా బలం లేదని చెప్పటం.. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద అబద్ధంగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సాక్షి ఛానల్ తోపాటు అనేక మీడియా సంస్థలను జగన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అబద్దం2: నాకు ఎలాంటి నేర చరిత్ర లేదంటున్న జగన్..!

తనకు ఎలాంటి నేర చరిత్రా లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో అబద్దం చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా జగన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ మేరకు తన నేర చరిత్రకు సంబంధించి స్వయంగా సంతక చేసిన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. అలాంటి జగన్ రెడ్డి నాలుగేళ్ళ తరువాత ఇలా నాలుక మడతేసి.. అడ్డంగా పచ్చి అబద్దాలడటం.. ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అబద్దం ఆడితే అతికినట్టు ఉండాలని.. కనీసం ఆ విషయాన్నైనా జగన్ రెడ్డి గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు.

అబద్దం3: నాకు అర్ధిక బలం, డబ్బు లేదంటున్న జగన్..!

చిలకలూరి పేటలో సభలో సీఎం జగన్ రెడ్డి.. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేని నిరుపేదనని నమ్మించేలా అబద్దాలు మాట్లాడారు. తనకు అర్ధబలం అస్సలు లేదని జగన్ రెడ్డి చెప్పటం అబద్దాల్లో కెల్లా అబద్దం అని జనం అంటున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల నాటికే 375 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రికార్డు సృష్టించారు. లోటస్ పాండ్, తాడేపల్లి, బెంగళూరుల్లో ప్యాలెస్ లు, భారతీ సిమెంట్స్, వివిధ కంపెనీల్లో షేర్లు, పెట్టుబడులు వీటన్నింటినీ కలిపితే జగన్ రెడ్డి అపరకేబేరులను మించి పోతారు. కానీ.. తన దగ్గర నయా పైసా కూడా లేదన్నట్టుగా జగన్ రెడ్డి అబద్దాలాడుతున్నారు.

అబద్దం 4: నాకు మోసం చేయటం తెలియదు.. అబద్దం ఆడటం రాదంటున్న జగన్..!

తనకు మోసం చేయటం తెలియదు.. అబద్దాలు చెప్పటం రాదంటూనే.. జగన్ రెడ్డి అబద్దాలు ఆడటాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో అనేక కేసుల్లో తనపై 420 సెక్షన్లు నమోదైన విషయాన్ని జగన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే.. అధికారంలోకి రావటం కోసం కోడికత్తి డ్రామాలు ఆడారు. వివేకా హత్య కేసును నారాసుర రక్త చరిత్రగా చిత్రీకరించారు. అధికారంలోకి రావటానికి నోటికి ఇష్టం వచ్చిన అబద్దాన్ని చెప్పేశారు. గత నాలుగేళ్ళుగా తనకు అలవాటైన అబద్దాలనే నిత్యం వల్లె వేస్తున్నారు. కానీ.. తనకు అబద్దం చెప్పటం రాదు.. మోసం చేయటం తెలియదు అని జగన్ చెబుతుండటంపై జనం దుమ్మెత్తి పోస్తున్నారు.

అబద్దం 5: నాకు అంగబలం లేదంటున్న జగన్..!

తన వెనుక ఎలాంటి అంగబలం లేదని.. రాజకీయాల్లో తాను ఒంటరిని అన్నట్టు జగన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. కానీ.. 2019 లో అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తన చుట్టూ ఓ మహా మానవహారాన్నే ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో వందలాది సలహాదార్ల దగ్గర నుంచి సివిల్ పోలీసులు, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ సిబ్బంది ఇలా సుమారు 10 లక్షల మందికి పైగా మందీ మార్బలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఏర్పాటు చేసుకోలేని ఓ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తమకు గిట్టని రాజకీయ నేతలకు.. ఖాకీల సాయంతో చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి జగన్ రెడ్డి తనకు నిజంగా అంగబలం లేదని అబద్దాలు చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అబద్దం6: నాకు ఎవరితోనూ పొత్తులు లేవంటున్న జగన్ రెడ్డి..!

తనకు రాజకీయంగా ఏ పార్టీతోనూ పొత్తు లేదని జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ సహకారాన్ని ఆయన తీసుకున్నారు. ఆనాటి నుంచి బీజేపీతో అప్రకటిత పొత్తును జగన్ కొనసాగిస్తున్నారు. నేటికీ బీజేపీని పన్నెత్తి మాట అనటానికి ఆయన ఒప్పుకోరు. మరోవైపు.. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో సైతం ఆయన దోస్తీ కొనసాగిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీకి రావాల్సిన ఆస్తులపై నోరు మెదపటం లేదు. అలాంటి జగన్ రెడ్డి.. పొత్తులు గురించి అబద్దాలు మాట్లాడటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అబద్దం 7: మాట తప్పను.. మడం తిప్పను.. చెప్పింది చేయటం ఒక్కటే తెలుసంటున్న జగన్ రెడ్డి..!

ఏపీకి ప్రత్యేక హోదా దగ్గర నుంచి… మద్య పాన నిషేధం వరకు.. సీపీఎస్ రద్దు నుంచి 3 రాజధానుల ఏర్పాటు వరకు.. జగన్ రెడ్డి పాలనంతా యూటర్న్‌లతోనే సాగుతోంది. ఒక మాట చెప్పటం.. ఆ వెంటనే బుకాయించటం జగన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఎన్నికల హామీల అమలులో మాట తప్పి.. మడం తిప్పిన జగన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచించారు. ప్రస్తుతం తన తప్పులను కవర్ చేసుకోవటానికి అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారు. అయితే.. జగన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను 2019లో గుడ్డిగా నమ్మిన ఏపీ ప్రజలు ఈ సారి అలాంటి పప్పులేవీ ఉడకవని చెబుతున్నారు. అయినా.. జనం ఏమనుకుంటారో అనే కనీస విచక్షణ లేని జగన్ రెడ్డి తనకు అలవాటైన అబద్దాలనే వల్లె వేస్తున్నారు.

ఇదీ.. చిలకలూరిపేట సభ సాక్షిగా జగన్ రెడ్డి చెప్పిన అబద్దాల జాబితా.. రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్ని అబద్దాలు చెబుతారో చూడాలి మరి..!!

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *