
త్వరలో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు?
- Ap political StoryNewsPolitics
- May 22, 2023
- No Comment
- 41
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన కాంగ్రెస్..కేసీఆర్, జగన్ లక్ష్యంగా రాజకీయంగా పావులు కదుపుతోంది. షర్మిలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు…ప్రియాంకగాంధీ రంగంలోకి దిగారన్న ప్రచారం జోరందుకుంది. అందుకు, కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే మధ్యవర్తిత్వం నడపుతున్నారని ఓ ప్రముఖ పత్రిక బాంబ్ పేల్చింది. తెలంగాణలో ఘర్ వాపసీ నినాదంతో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందర్నీ తిరిగి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్..షర్మిల పార్టీని విలీనం చేయాలని కోరుతోందట. ఆ దిశగా షర్మిలతో ప్రియాంకగాంధీ చర్చలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ చీఫ్ పదవి ఆఫర్ చేశారనే వార్త సంచలనం రేపుతోంది.
మొదట్నుంచి షర్మిల విషయంలో తెలుగురాష్ట్రాల్లో పేరున్న ఓ పత్రిక సంచలన విషయాలను వెల్లడిస్తోంది. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు దగ్గర్నుంచి..జగన్, చెల్లి మధ్య ఆస్తిగొడవల వరకు అనేక విషయాలను వెల్లడించింది. అయితే, తాజాగా కేసీఆర్, జగన్ లపై కాంగ్రెస్ షర్మిల బాణం ఎక్కుపెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు షర్మిల దగ్గరవుతున్నారని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. షర్మిలను హస్తం గూటికి చేర్చేందుకు కర్ణాటటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం నడుపుతున్నారనేది అందులోని సారాంశం. నెల క్రితం ప్రియాంక గాంధీ, షర్మిల ఇద్దరూ సుధీర్ఘంగా ఫోన్‌లో చర్చలు జరిపారని కూడా రాశారు. ముందుగా తెలంగాణలో కలిసి పనిచేసి, ఆ తర్వాత ఏపీలో చురుకైన పాత్ర పోషించాల్సిందిగా షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ కోరినట్లు వెల్లడించారు. తెలంగాణలో కంటే ఏపీలోనే షర్మిలకు ఎక్కువ లాభం ఉంటోందని, ఏపీ బాధ్యతలను ఆమెకు అప్పగించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందట.
కర్ణాటక ఫలితాల తర్వాత శివకుమార్ ను బెంగళూరులో షర్మిల కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం వార్తలొచ్చాయి. వాటిని షర్మిల ఖండించినప్పటికీ.. అలాంటి చాన్స్ లేదని చెప్పలేమన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. షర్మిల కూడా కాంగ్రెస్ నుంచి తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో షర్మిల ఎంత పోరాడుతున్నా వృథాప్రయాసే అవుతోంది. పార్టీలో పెద్దగా చేరికలు లేవు. తెలంగాణ ప్రజానీకం షర్మిల పార్టీకి మద్దతుగా నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే, వైఎస్సార్ అభిమానులు, రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓట్ షేరింగ్ ఉన్న షర్మిలను…తమలో కలిపేసుకుంటే తెలంగాణలో గట్టెక్కడంతో పాటు ఏపీలో జగన్ ను గట్టిగా ఢీకొట్టొచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.
మరోవైపు, ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపు వెళ్లిపోయింది. ఆ ఓటు బ్యాంకును తిరిగి రాబట్టేందుకు, జగన్ వదిలిన బాణాన్ని తిరిగి ఆయనపైనే ప్రయోగించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇక, షర్మిల కూడా అన్న జగన్…తనకు ఆస్తులు పంచివ్వకుండా, తన కంపెనీల్లో ఇతరులెవరూ పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో ఉన్నారట. ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల కాలంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి విజయమ్మ షర్మిల వద్దకు వెళ్లిపోయారు. అదే సమయంలో వివేకా హత్య కేసులో జగన్ ను ఇరుకునపెట్టేందుకు సునీతకు మద్దతుగా షర్మిల నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ ఆదరణ ఉంటుందని భావిస్తున్న షర్మిల… అన్నీ కుదిరితే ఆంధ్రా రాజకీయాల్లో అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
మొత్తంగా, షర్మిల తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. తెలంగాణ, ఆ తరువాత ఏపీ టార్గెట్ గా కాంగ్రెస్ నయా రాజకీయం మొదలుపెట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం, షర్మిల నిర్ణయమే ఇప్పుడు కీలకం కానుంది.