మీ బటన్ నొక్కుడు పథకాలకు మమ్మల్ని బలి చేస్తారా..?

మీ బటన్ నొక్కుడు పథకాలకు మమ్మల్ని బలి చేస్తారా..?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు జగన్ రెడ్డికి పట్టిన దెయ్యం వదిలింది. గ్రాడ్యుయేట్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ తో అహం దిగిపోయింది. భ్రమలు తొలగిపోయాయి. వై నాట్ 175 పాట ఆపేశాడు. ఇప్పుడు వైసీపీలో 50 మంది జంప్ జిలానీలు ఉన్నారని తెలియడంతో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కాళ్లబేరాలకు దిగాడు. ఇటీవల జరిగిన సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు మొహమాటం లేకుండానే సీఎం జగన్ రెడ్డిని కడిగిపారేశారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలతో పనులు చేసినా బిల్లులు రావడం లేదంటూ ఎమ్మెల్యేలు, సీఎం ను గట్టిగానే నిలదీశారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. జగన్ నియంత పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం పెరిగిపోతోంది. ఇక జగన్ అరాచకాలను ఎంతమాత్రం భరించలేని ఆ పార్టీలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. దాంతో, సీఎం షేక్ అయిపోతున్నారు. మొన్నటి దాకా ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, ఇష్టారాజ్యంపై వారిపై జులూం ప్రదర్శించిన జగన్… ఎమ్మెల్యేల్లో గూడుగట్టుకున్న అసంతృప్తి లావాలా దహించేస్తుండడంతో జగన్ నోట మాట పడిపోయింది. ఇప్పటి వరకూ నేనే మీ భవిష్యత్తు అంటూ ఊదరగొట్టిన జగన్, ప్రస్తుతం మీరే నా భవిష్యత్తు అంటూ కొత్త రాగం అందుకున్నారు. జగన్ రెడ్డి ప్రవర్తనలో ఇంత మార్పు రావడం చూసి ఎమ్మెల్యేలు షాక్ అవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. సీఎం జగన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో ఇది బహిర్గతం అయింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఒత్తిడితో కాంట్రాక్టర్లు నాడు – నేడు పనులతో పాటు అక్కడక్కడా రోడ్లు నిర్మించారు. వారు పనులు పూర్తి చేసి సంవత్సరం గడుస్తున్నా నేటికీ రూ. 6 వేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది. ఎంతో మంది కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేల ఒత్తిడితో అప్పులు చేసి మరీ పనులు చేశారు. ఏడాది గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. వారు నియోజకవర్గానికి వెళితే ముందుగా పనులు చేసిన కాంట్రాక్టర్లు వచ్చి వాలిపోతున్నారు. వారికి సమాధానం చెప్పుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. సీఎం జగన్ రెడ్డి మాత్రం బటన్ నొక్కుడు ద్వారా 2 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశానంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు.

క్షేత్ర స్థాయిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. మా గ్రామంలో ఇంత వరకు ఒక రోడ్డుగానీ, డ్రైనేజీ కూడా నిర్మించలేదంటూ ఓ మహిళ సీనియర్ మినిస్టర్ బొత్సను నిలదీసింది. దీంతో సమాధానం చెప్పుకోలేక మంత్రి బొత్స అక్కడ నుంచి చిన్నగా జారుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఓ మహిళ కొట్టినంత పనిచేసింది. నాలుగేళ్లు అయినా ఒక్క డీఎస్సీ ఇవ్వలేదంటూ మండి పడింది. ఎన్నికలకు ముందు ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. నిజమేనని నమ్మి ఓట్లేశాం. మీకు పదవులు అయితే వచ్చాయి, కానీ ఇంత వరకు ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగ యువతి రెచ్చిపోయింది. దీంతో సమాధానం చెప్పుకోలేక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇవి రెండూ ఈ వారంలో జరిగిన చిన్న శాంపిల్స్ మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. జగన్ రెడ్డి ప్రతి సమావేశంలో వై నాట్ 175 అని అంటుంటే వైసీపీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో మొహమాటం లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం జగన్ రెడ్డిని అడిగేశారట. దీంతో వారిని బుజ్జిగించేందుకు సీఎం నానాపాట్లు పడ్డారని తెలిసింది.

వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనానికి గురికావడానికి కారణం లేకపోలేదు. గ్రామాల్లో ఏ పని ఉన్నా జనం వాలంటీరు వద్దకు వెళుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మాత్రం రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరులాంటి సదుపాయాల గురించి నిలదీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రోడ్లను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. అసలు రోడ్లు అవసరమా? అనే విధంగా ప్రవర్తించారు. దీంతో గ్రామాలకు వెళ్లే రోడ్లు, పల్లెల్లోని అంతర్గత రోడ్లు దారుణంగా తయారయ్యాయి. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ పాంప్లెట్లు పట్టుకుని ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను జనం ఓ ఆట ఆడుకుంటున్నారు. వారికి సమాధానం చెప్పలేక మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు రోజా, ఆళ్లనానితో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా గట్టిగానే సీఎంను నిలదీశారట. సీఎంతో సమావేశం ముగిసిన తరవాత వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆఫ్ ద రికార్డుగా పాత్రికేయులతో వారి బాధలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలను సంతృప్తి పరచేందుకు సీఎం జగన్ రెడ్డి ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం వారి ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు.

వైసీపీలో ఎమ్మెల్యేల పరిస్థితి బయటకు కనిపిస్తున్నంత సాఫీగా అయితే లేదు. పార్టీలో విలువే లేకుండా పోయింది. పట్టుమని పదిలక్షల విలువైన పని కూడా ఎమ్మెల్యేలు చేయించుకోలేకపోతున్నారు. చిన్న పనులు కూడా చేయించకుండా, ప్రజల వద్ద మరలా ఓట్ల కోసం ఎలా వెళ్లాలంటూ మీడియా మిత్రుల వద్ద వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రతి కాలనీలో ఏదో ఒక అభివృద్ధి జరిగితే, ఈ పని మేం చేయించాం. మరలా గెలిపిస్తే మిగిలిపోయినవి కూడా చేయిస్తాం అని చెప్పుకోవచ్చు. కానీ, ఎక్కడా వైసీపీ ప్రభుత్వం అభివృద్ది పనులు చేయలేదు. అక్కడక్కడా చేసిన పనులకు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి చెల్లని రూపాయిలా మారింది. విలువ లేని చోట ఎందుకంటూ కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడటం చూస్తుంటే ఆ పార్టీ అధినేతపై వారు ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రాబోయే సంవత్సరకాలంలో ఇలాంటి పరిస్థితుల నుంచి వైసీపీ అధినేత గట్టెక్కడం మాత్రం అసాధ్యంగానే కనిపిస్తోంది.

Related post

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. 2014 ఎన్నికల నాటి ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్…
బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *