సజ్జల సలహాలతో.. వైసీపీ కొంప కొల్లేరేనా..?

సజ్జల సలహాలతో.. వైసీపీ కొంప కొల్లేరేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలన్నింటినీ తన కంటి చూపుతో శాసిస్తున్న ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అంతకు ముందు వరకు నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డిని సైతం పక్కన పెట్టించిన నైపుణ్యం సజ్జల సొంతం. సాధారణ విలేకరి స్థాయి నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా.. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “షాడో సీఎం”గా చక్రం తిప్పుతున్నారు. పార్టీ వ్యవహారాలైనా.. ప్రభుత్వ పాలసీ మేటరైనా.. సజ్జలకు తెలియకుండా గడ్డి పరక కూడా కదలని పరిస్థితి ఏపీలో నెలకొంది. తాడేపల్లి ప్యాలెస్‌కే సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిమితం కాగా.. ఆయన కేబినెట్‌లోని మంత్రులంతా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. ఈ క్రమంలో సకల శాఖలకు.. అన్ని విభాగాలకు అధిపతిగా సజ్జల అవతరించారు. సకల శాఖా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన శాసిస్తున్నారు.

అయితే.. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్న విషయం సజ్జల విషయంలోనూ వర్తిస్తోంది. గత నాలుగేళ్ళుగా సీఎం జగన్ సర్కార్ తీసుకున్న అనేక అసంబద్ద నిర్ణయాలకు సజ్జలే బాధ్యుడని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేత నుంచి మూడు రాజధానుల పేరుతో అమరావతి ని నాశనం చేసిన ఘనుడు కూడా సజ్జలే అని వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అంటున్నారు. లిక్కర్, శాండ్ మాఫియాలో వసూళ్ళు.. విశాఖ, అమరావతి ప్రాంతంలో భూ దందాల సొమ్ములన్నీ సజ్జల ద్వారా సీఎంకు చేరుతున్నాయని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్ళూ వైసీపీలో మౌనంగా వీటన్నింటినీ భరించామని.. అయితే ఇకపై సీఎం జగన్, సలహాదారు సజ్జల అరాచకాలను, నిజ స్వరూపాన్ని జనం ముందు పెడతామని ఎమ్మెల్యే శ్రీదేవి వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఒక్కడే అని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి చేస్తున్న సంచలన ఆరోపణలు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న మొన్నటి వరకు ఏపీ ప్రజల గుండె “జగన్ జగన్ అని కొట్టుకుంటోంది” అంటూ ఊరూ వాడా తిరిగి చెప్పిన శ్రీదేవి.. ఇలా లోగుట్టు బయట పెట్టటం కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా వైసీపీ నుంచి వేటుకు గురైన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం సలహాదారు సజ్జలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. సాధారణ విలేకరిగా వార్తలు రాసుకునే సజ్జల.. ఇవాళ వేల కోట్ల ఆస్తులకు అధిపతి ఎలా అయ్యారంటూ ఆనం ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నించే గొంతుకలను.. పోలీసు లాఠీలతో అణిచి వేస్తున్నారని.. దీనికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అని ఆనం విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదంటున్న ఆనం.. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పూచికపుల్లంత విలువు కూడా ఇవ్వరని మండిపడ్డారు. సీఎం జగన్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలన్నింటికీ బాధ్యుడు సజ్జల రామకృష్ణా రెడ్డే అంటూ విమర్శల వర్షం కురిపించారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఓవర్ యాక్షన్‌పై విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే.. వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఖండిస్తూ వస్తున్నారు. సీఎం జగన్, సలహాదారు సజ్జల భజనలో మునిగితేలారు. అలాంటి ఎమ్మెల్యేలే ఇప్పుడు సజ్జల నిజస్వరూపం ఇదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో నెలకొన్న అరాచకానికి అసలు కారకుడు సజ్జలే అంటూ ఒక్కో విషయాన్ని బయట పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి సజ్జలపై చేస్తున్న ముప్పేట దాడి జగన్ సర్కార్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇన్నాళ్ళూ విపక్షాల ఆరోపణలను ఏదో ఒక రకంగా ఎదుర్కొన్న జగన్ టీం… ఇప్పుడు సొంత పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. రచ్చబండ పేరుతో జగన్ సర్కార్‌కు చాకిరేవు పెడుతున్న వైసీపీ ఎంపీ రఘు రామరాజుకు.. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు జత కలవటం.. వైసీపీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిన తరుణంలో.. తమ పార్టీకి ఇదేం ఖర్మ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

ఇక.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సజ్జల తప్పుడు సలహాల వల్లే పార్టీ ఘోరంగా దెబ్బతిందని.. వైసీపీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన పట్టభద్రుల్ని అవమానించేలా సజ్జల మాట్లాడటం కరెక్ట్ కాదనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న అనేక అసంబద్ద నిర్ణయాలపైనా వైసీపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. వైసీపీతో పాటు సీఎం జగన్ గ్రాఫ్ ఘోరంగా దెబ్బ తినటం వెనుక కూడా సజ్జల తప్పుడు సలహాలే కారణమని వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్.. సజ్జల విషయంలో కళ్లు తెరవక పోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బంగాళాఖాతంలో కలపటం ఖాయమని తేల్చి చెబుతున్నారు.

Related post

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీలో ముసలం..?

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. 2014 ఎన్నికల నాటి ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్…
బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

బాబుతో మాట్లాడతారనే భయంతో.. కోడికత్తి శ్రీనును విశాఖకు తరలింపు

కోడికత్తి కేసు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను మరో చోటకు షిఫ్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ ను…విశాఖకు తరలించినట్లు తెలుస్తోంది.…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *