
విశాఖలో తారాస్థాయికి వైవీ , సాయిరెడ్డిల వివాదం
- Ap political StoryNewsPolitics
- May 15, 2023
- No Comment
- 25
ఏపీలో జగన్ రెడ్డి పార్టీలో అసమ్మతి జ్వాలలు, అసంతృప్త స్వరాలు, ఆధిపత్య పోరు ఎక్కువైపోయాయి. ఓ వైపు ప్రకాశం జిల్లాలో వైవీ వర్సెస్ బాలినేనిల మధ్య వార్ కొనసాగుతుండగానే… విశాఖ జిల్లాలో మరో యుద్ధం నడుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. సాయిరెడ్డిని సైడ్ చేసిన జగన్ పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలను వైవీకి అప్పగించారు. దాంతో, అక్కడ వీసారెడ్డికి పవర్స్ లేకుండా పోయాయి. అయితే, ఇప్పటికే జగన్ రెడ్డి తనను దూరం పెట్టాడని రగిలిపోతున్నారు విజయసాయిరెడ్డి. పుండుమీద కారం చల్లిననట్లు వైవీ సుబ్బారెడ్డి విశాఖలో తన మనుషులను టార్గెట్ చేయడంతో సాయిరెడ్డిలో కోపం నశలానికి ఎక్కుతోందట. ఈ క్రమంలోనే ఏ పదవి లేకపోయినా విశాఖలో పార్టీపై పట్టు వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు.
ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి సీట్లోకి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి..తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీసా రెడ్డి నియమించిన వారందరినీ పార్టీ పదవుల నుంచి బయటకు పంపే కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో, ఇంతకాలం సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి మళ్లీ నిద్రలేచారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుని హోదాలో.. మళ్లీ విశాఖలో తన అనుచరుల్ని నియమిస్తూ సాయిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చేశారు. అయితే, సాయిరెడ్డి తీరుపై మండిపోయిన వైవీ ఏకంగా ఆయన అనుచరుల్ని పార్టీ నుంచి బహిష్కరించేశారు. ఇటీవల జగన్ భీమిలి పర్యటనకు వెళ్లిన సమయంలోనూ…ఎక్కడా విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏ సమస్య ఉన్నా వైవీకి చెప్పాలని సూచించారట. వైవీ, సాయిరెడ్డిల మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది. తాజాగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలతో మరింత అగ్గి రాజుకుంటోంది.
గతంలో విజయసాయిరెడ్డి యువజన విభాగం ఇన్ ఛార్జిగా సునీల్ కుమార్, మహిళా విభాగం ఇన్ ఛార్జిగా గౌరి పేర్లను ఫైనల్ చేశారు. అయితే.. ఈ పేర్లపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో జోనల్ ఇన్ ఛార్జుల నియమకాన్ని కొద్ది రోజుల పాటు పక్కన పెట్టారు. అయితే, కొత్తగా వచ్చినన వైవీ విశాఖలో జోనల్ ఇన్ ఛార్జులుగా కొందరిని నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైంది. యువజన విభాగానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి సందీప్.. మహిళా విభాగానికి విశాఖ పార్లమెంటు నియోజకవర్గ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు పీలావెంకట లక్ష్మిల పేర్లను ఖరారు చేస్తూ.. ఈ నెల 10న ప్రకటన విడుదల చేశారు. దాన్ని రద్దు చేస్తూ, వారిస్థానంలో సునీల్ కుమార్.. గౌరిలను నియమిస్తూ విజయసాయిరెడ్డి ప్రకటన చేయడం… వైవీ వారిని బహిష్కరించడంతో విశాఖ వైసీపీలో సెగలు రేగుతున్నాయి.
ఇప్పటికే వైవీ ధాటికి బాలినేని పార్టీ పదవులన్నీ వదిలేసి పక్కకు వెళ్లిపోయారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా విశాఖలో వైవీ వర్సెస్ విజయసాయిల మధ్య కోల్డ్ వార్ రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డికి జగన్ ఏ పవర్స్ లేకుండా చేసినప్పటికీ, ఆయన మాత్రం తగ్గేదేలే అంటుండడంతో వైసీపీలో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశమున్నట్లే కనిపిస్తోంది.